🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 10:42 am Posted by : MANA PRAJA AKSHARAM

చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం

News Image
*చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం:*

*చిట్యాల, అక్టోబర్ 12 (ప్రజా అక్షరం ప్రతినిధి):*

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు నేరాల నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచాలని యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోక్సో కేసుల్లో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. దొంగతనాల నివారణకు రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని తెలిపారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఐజీ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ తనిఖీలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సీఐ సురేష్, ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home