Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పారదర్శకతకు సుప్రీం పీఠం: ప్రభుత్వ నియామకాల రహస్య గోడలను బద్దలు కొట్టిన తీర్పు

పారదర్శకతకు సుప్రీం పీఠం: ప్రభుత్వ నియామకాల రహస్య గోడలను బద్దలు కొట్టిన తీర్పు

పారదర్శకతకు సుప్రీం పీఠం: ప్రభుత్వ నియామకాల రహస్య గోడలను బద్దలు కొట్టిన తీర్పు

ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల మార్కులు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం. అయితే గత కొన్నేళ్లుగా వ్యక్తిగత గోప్యత అనే నెపంతో అనేక రకాల ముసుగులు వేసి, ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దాచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. విశేషించి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల మార్కులు, మెరిట్ జాబితాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించడం పరిపాటిగా మారింది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఒక సంచలనాత్మక తీర్పు ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ వ్యవస్థల్లోని రహస్య గోడలను బద్దలు కొట్టింది. సమాచార హక్కు ఉద్యమానికి ఊపిరిలూదుతూ పారదర్శకతే ప్రజాస్వామ్యానికి ప్రధాన స్తంభమని ఈ తీర్పు మరోసారి చాటిచెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ చారిత్రాత్మక ఘట్టానికి మూలం మహారాష్ట్రలోని పూణే జిల్లా కోర్టులో జరిగిన జూనియర్ క్లర్క్ నియామక ప్రక్రియ. ఆ పరీక్షకు హాజరైన శ్రీ ఓంకార్ దత్తాత్రేయ కల్మాంకర్ అనే అభ్యర్థి నియామక ప్రక్రియలో పారదర్శకతను పరిశీలించేందుకు గాను ఎంపికైన వారితో పాటు పోటీపడిన ఇతర అభ్యర్థులందరూ సాధించిన మార్కుల వివరాలను స"హా" చట్టం కింద ఇవ్వాలని కోరారు. అయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదాలో కోర్టు రిజిస్ట్రార్ ఈ విన్నపాన్ని తోసిపుచ్చారు. ఇతర అభ్యర్థుల యొక్క మార్కులు వ్యక్తిగత సమాచారం అని చట్టంలోని సెక్షన్ 8(1)(జె) కింద ఆ సమాచారాన్ని వెల్లడించలేమని నిరాకరించారు. సమాచారాన్ని నిరాకరించడంపై కల్మాంకర్ వెనకడుగు వేయకుండా బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం బొంబాయి హైకోర్టు ధర్మాసనం ప్రజా ప్రయోజనం ముందు వ్యక్తిగత గోప్యత సాకులు చెల్లవని తేల్చిచెబుతూ అభ్యర్థులందరి మార్కులను వెల్లడించాలని సంచలన తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లగా జస్టిస్ సుధాన్షు ధూలియా మరియు జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ అధికారుల పిటిషన్‌ను కొట్టివేసింది.

సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 8(1)(జె) అనేది అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న నిబంధనలలో ఒకటి. ప్రభుత్వం లేదా అధికారులు ఏ సమాచారాన్ని దాచాలన్నా ఇది మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అనే సాకును చూపుతుంటారు. కానీ అదే సెక్షన్ ముగింపులో ఏ సమాచారమైతే ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడుతుందో ఆ సమాచారాన్ని వెల్లడించాలనే ఒక స్పష్టమైన మినహాయింపు ఉంది. సుప్రీంకోర్టు సరిగ్గా ఈ సూత్రాన్నే ఎత్తిచూపింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, అది ప్రజా సేవకు సంబంధించినది. ఆ ఉద్యోగాల నియామకం నిష్పక్షపాతంగా మెరిట్ ఆధారంగా జరిగిందా లేదా అని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి, సమాజానికి ఉంటుంది. ఇతరుల మార్కులను వెల్లడించడం ద్వారా ఎవరి వ్యక్తిగత జీవితానికీ భంగం వాటిల్లదని పైగా అది రిక్రూట్‌మెంట్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నిజానికి సమాచారాన్ని దాచిపెట్టడం కంటే స్వచ్ఛందంగా వెల్లడించడమే అధికారుల గౌరవాన్ని, వ్యవస్థ విశ్వసనీయతను సమాజంలో మరింత పెంచుతుంది. సమాచార హక్కు చట్టాన్ని అధికారులు తమ విధుల నిర్వహణకు ఒక అడ్డంకిగా చూడకుండా, పాలనలో ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పే ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. ఎందుకంటే పారదర్శకత అనేది కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, అది ప్రభుత్వ యంత్రాంగం పట్ల ప్రజల్లో అపారమైన గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచే ఒక సాధనం. పారదర్శక పాలన సాగించే అధికారులు సమాజంలో ఎప్పుడూ ఎంతో గౌరవప్రదమైన స్థానంలో నిలుస్తారు.

మన దేశంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియల్లో స్వపక్షపాతం, అవినీతి, మార్కుల దిద్దుబాట్లు వంటి అక్రమాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. పరీక్ష రాసిన అభ్యర్థికి తనకు వచ్చిన మార్కులు మాత్రమే తెలిసి, మిగతా వారి మార్కులు తెలియకపోతే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చిందా, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చిందా అనే విషయం ఎప్పటికీ వెలుగులోకి రాదు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యక్తిగత సమాచారం అనే ముసుగులో ప్రభుత్వ నియామకాల్లోని అక్రమాలను దాచడం ఇకపై కుదరదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇది సమాచార హక్కు కార్యకర్తలకు, పారదర్శకతను కోరుకునే పౌరులకు కొండంత బలాన్నిస్తుంది.
సమాచార హక్కు చట్టం అనేది కేవలం కాగితాలపై ఉండే నిబంధనల సమాహారం కాదు, అది ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభం. గోప్యత పేరుతో ప్రజా సమాచారాన్ని దాచే ధోరణి పెరుగుతున్న ఈ రోజుల్లో, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రహస్యాల తెరలను తొలగించింది. ఈ తీర్పు భారత న్యాయ సేవా చరిత్రలోనూ సమాచార హక్కు ఉద్యమంలోనూ సువర్ణాక్షరాలతో  లిఖించదగినదిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


శ్రీ ఓంకార్ దత్తాత్రేయ కల్మాంకర్ వర్సెస్ పౌర సమాచార అధికారి & రిజిస్ట్రార్, జిల్లా సెషన్స్ కోర్టు, పూణే  కేసులో (రిట్ నెం. 9648/2021) బొంబాయి హైకోర్టు తీర్పు, మరియు స్పెషల్ లీవ్ పిటిషన్ (సి) 2783/2025 లో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా