Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 12:56 PM | పండుగ
బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక

గజ్వేల్: అక్టోబర్6 (ప్రజా అక్షరం):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి గొప్పతనానికి ప్రతీక అని అన్నారు. పూలను అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయమన్నారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతిని గౌరవించడం, సంప్రదాయాలను కాపాడుకోవడం, మహిళల ఐక్యతను చాటడం వంటి గొప్ప సందేశాన్ని అందించే సాంస్కృతిక వేడుక అని రామకోటి రామరాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తొమ్మిది రోజుల విశిష్టత:
అక్టోబర్ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, 11న అటుకుల బతుకమ్మ, 12న ముద్దపప్పు బతుకమ్మ, 13న నానబియ్యం బతుకమ్మ, 14న అట్ల బతుకమ్మ, 15న అలిగిన బతుకమ్మ, 16న వేపకాయల బతుకమ్మ, 17న వెన్నముద్దల బతుకమ్మ, చివరగా అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
1. అక్టోబర్ 10 - ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఈరోజు తక్కువ పూలతో బతుకమ్మను చేస్తారు. నైవేద్యంగా నువ్వులు, నూకలు, బియ్యం సమర్పిస్తారు.
2. అక్టోబర్ 11 - అటుకుల బతుకమ్మ: రెండో రోజు. కొత్త బియ్యంతో చేసిన అటుకులను బెల్లంతో కలిపి నైవేద్యంగా పెడతారు.
3. అక్టోబర్ 12 - ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు. పెసరపప్పు, బెల్లం, పాలతో చేసిన ముద్దపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు.
4. అక్టోబర్ 13 - నానబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు. బియ్యాన్ని నానబెట్టి బెల్లం, పాలతో కలిపి నైవేద్యంగా పెడతారు.
5. అక్టోబర్ 14 - అట్ల బతుకమ్మ: ఐదో రోజు. బియ్యం పిండితో అట్లను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
6. అక్టోబర్ 15 - అలిగిన బతుకమ్మ: ఆరో రోజు అమ్మవారు అలిగినట్లు భావించి ఈరోజు బతుకమ్మను చేయరు.
7. అక్టోబర్ 16 - వేపకాయల బతుకమ్మ: ఏడో రోజు. బియ్యం పిండిని వేపకాయల ఆకారంలో చేసి, నూనెలో వేయించి నైవేద్యంగా సమర్పిస్తారు.
8. అక్టోబర్ 17 - వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు. నువ్వులు, బెల్లం, వెన్నతో చేసిన ముద్దలను నైవేద్యంగా పెడతారు.
9. అక్టోబర్ 18 - సద్దుల బతుకమ్మ: చివరి రోజు, అత్యంత ముఖ్యమైన పండుగ. ఈరోజు అతి పెద్ద బతుకమ్మను తయారు చేస్తారు. ఐదు రకాల సద్దులు, పిండివంటలు నైవేద్యంగా సమర్పించి, సాయంత్రం చెరువులలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.